కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభంకానుంది. మేడిగడ్డతోపాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 9 అంశాలపై విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో 24న ఆయన హైదరాబాద్ వచ్చి వరుసగా నాలుగు రోజులపాటు విచారణ జరిగే అవకాశలు ఉన్నాయి. మొదట విధివిధానాలు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఖరారు చేయడంతోపాటు న్యాయవాదులు, సిబ్బంది, బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది, నిపుణులను కమిషన్ నియమించుకోనుంది.









