మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పిచ్చి ముదిరి పీక్ స్టేజ్‌కు వెళ్లిందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమేనన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ టైం, ప్లేస్ చెపితే.. టెస్ట్ కి మేం ఏర్పాటు చేస్తామన్నారు. డ్రగ్స్ విషయంలో రేవంత్ సవాల్ విసిరి గన్ పార్క్ వస్తే కేటీఆర్ పత్తా లేకుండా పారిపోయారని చెప్పారు. కేటీఆర్‌కు పిచ్చి ముదిరి పీక్ స్టేజ్‌కి వెళ్ళిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌లో నిజాలు బయటపడుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని కామెంట్స్ చేశారు. భార్య భర్తలు, జడ్జీల ఫోన్లు కూడా కేటీఆర్ విన్నారని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. నా ఫోన్ ట్యాప్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసేంత పరిస్థితి ఏముందని నిలదీశారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని కేటీఆర్ ఇంకోసారి మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ వెంపర్లాడింది నిజం కాదా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.









