బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని వ్యాఖ్యానించారు. అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పార్టీని వీడరని స్పష్టం చేశారు. తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేకు తగినన్ని సీట్లు రావని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా విపక్ష ఇండియా కూటమికి పూర్తి మెజారిటీ రాకపోవచ్చన్నారు. కానీ కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ 15 నుంచి 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమాను వ్యక్తం చేశారు.









