మనం పదేళ్లు పాలించామని, వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరలించుకు పోయాడాని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారుని, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు.. పని లేదని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చిందన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందన్నారు. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని వ్యాఖ్యానించారు. సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఅర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురజ చల్లిండని, ఇప్పుడు బడే మియా అంటున్నాడని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణలో బీఆర్‌ఎస్ లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.
పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా అని ప్రశ్నించారు. ఇంటికి రెండెడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిండని, మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. బీజేపీని ఓడించే శక్తి బీఅర్ఎస్‌కు మాత్రమే ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలన్నారు. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. గులాబీ జెండాకు ప్రాణం పోసింది సిద్దిపేట అని చెప్పారు. సిద్దిపేటకు అన్యాయం జరిగితే.. అక్కసు వెళ్ళగట్టితే ఉరుకుందామా నిలదీశారు. సిద్దిపేట ప్రజలుగా చీము నెత్తురు ఉందని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోస పోదామా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేటలో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లుకు రూ.150 కోట్లు రద్దు చేసిండని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధి ఫై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు అక్కసు వెళ్లగక్కుతున్నారని, అలాంటి వారికి సిద్దిపేటలో ఓట్లు ఎట్లా వేస్తామన్నారు. సిద్దిపేట అంటే ప్రత్యేకత, గౌరవం ఉందని, ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుందామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.









