బీజేపీ ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు పెంచలేదని, వృద్ధులకు, వితంతువులకు ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరలను నియంత్రిస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం అన్నారని, నల్లధనాన్నివాళ్లే దోచుకున్నారని విమర్శించారు. పదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో పేదలు ఇబ్బంది పడుతున్నారని అన్ని సర్వేలు చెప్తుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. గత మేనిఫెస్టోలో బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. బీజేపీకి ఇంకా మేనిఫెస్టో లేదని, కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, బీజేపీవి అన్ని లంగా మాటలు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కుట్రలన్ని తేట తేల్లమ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తీసుకెళ్లి పోతే.. ఇక్కడ బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎయిమ్స్ లో 750 పడకలు ఉండాలి కానీ 135 మాత్రమే ఉన్నావన్నారు. బీజేపీ తెలంగాణకు ఏమి చేశారని ప్రజలు ఓట్లు వేయాలని నిలదీశారు. మోడీ మూడు నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులకు చావుకు కారణమైండని అన్నారు. మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీ నాయకుల ప్రచారాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని నిలదీయండని చెప్పారు. బీజేపీ మాయమాటలు, మోసాలను ప్రజలు నమ్మరని, బీజేపీ హయాంలో యువత మాదకద్రవ్యాలకు, జూదానికి అలవాటు పడ్డారని సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.









