AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతు చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది.. మంత్రి పొన్నం ఫైర్

ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, విభజన హామీలు విస్మరించిన బీజేపీకి వ్యతిరేకంగా ఈ నెల 14 న కరీంనగర్‌లో దీక్ష చేస్తున్నామని అన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ విభజన చట్టంలోని అంశాలను హేళన చేసిన బీజేపీ ఏ నైతిక హక్కుతో ఓట్లు ఆడుతారని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్నారు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రాముడు ఫోటోలు, అక్షింతలు పంపడం కాదు.. ప్రతి ఇంటికి ఏం ఇచ్చారన్నారు. పదేళ్లలో ప్రగతి సాధించామని చెబుతున్న బీజేపీ చేతనైతే రాముడితో కాకుండా మోడీ బొమ్మతో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. రాముడు అందరివాడు.. బీజేపీ నేతలది కాదన్నారు.

రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు గెలిచిన పార్లమెంట్ నియోజక వర్గాల్లో చేసిందేంటో చెప్పాలన్నారు. ప్రకృతి వైపరీత్యం జరిగింది రైతులు నష్టపోయారని చెప్పారు. కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా రైతులకు రూ. 25 వేల నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతమంది రైతులు చనిపోయారో లెక్కలు తీయండన్నారు. రైతుల కళ్ళల్లో నెత్తురు చూసి, రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తతంగం అంతా ప్రజలు గమనిస్తున్నారని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఓర్వలేని కొందరు కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు ఇంకా అధికారంలో అన్నట్టు భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీసింది మోడీ ప్రభుత్వం ముందు.. ముక్కుకు నేలకు రాసి బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కోసం బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ANN TOP 10