ఐపీఎల్ 2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని హార్దిక్ సేన ఉఫ్‌మని ఊదేసింది. కేవలం 15.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 199 పరుగులతో ముంబై ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుగా ఓడించింది.
ముంబై ఓపెనర్ ఇషాన్ కిషాన్ (69; 34 బంతుల్లో 7 ఫోర్లు, 5సిక్సులు) హాఫ్ సెంచరీ, సూర్యకుమార్ యాదవ్ (52; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో విజృంభించడంతో ముంబై జట్టు సునాయసంగా విజయం సాధించింది. మిగతా ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ (38), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21), తిలక్ వర్మ (16) పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో ఆకాష్ దీప్, వైశాఖ్ విజయ్ కుమార్, విల్ జాక్స్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా (5/21)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.









