హోం గ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ లో అపజయమెరుగని ఆ జట్టుకు గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటమి రుచి చూపించింది. బుధవారం (ఏప్రిల్ 10) రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన థ్రిల్లింగ్ పోరులో గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని గిల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. గుజరాత్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు కావాలి. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌండరీ కొట్టి టైటాన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (72) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా… చివర్లో తెవాతియా (22), రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్, 4 ఫోర్లు ) చెలరేగి ఆడి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ 3, చాహల్ 2 వికెట్లు తీశారు. కాగా ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఇది తొలి ఓటమి.
కాగా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ నిర్ణయాన్ని రాజస్థాన్ సద్వినియోగం చేసుకుంది.ఆరంభ ఓవర్లలో భారీగానే పరుగులు సాధించింది. అయితే యశస్వి జైస్వాల్ 24, జోస్ బట్లర్ 8 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇద్దరూ గుజరాత్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. . వీరిద్దరు మూడో వికెట్‌కు 83 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. షిమ్రాన్ 13 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. కాగా, గుజరాత్‌లో మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్ తలో వికెట్ కోల్పోయారు.









