వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ప్రతిష్టాత్మకమన్నారు.
ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని, ప్రచారంలో పథకాలే వినియోగించుకొని విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.









