AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు..!

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుకు సంబంధించిన ఒక కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఫొటోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా అంబటి రాంబాబుకు BNSS 35(3) సెక్షన్ కింద నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఆ నోటీసులు అందజేసి, ఆయన నుంచి వివరణ తీసుకోవాలని గుంటూరు-అరండల్‌పేట పోలీసులకు సూచించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడైన టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావుకు కూడా నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది.

తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే అంశంపై రెండు విభిన్న ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్టపరంగా చెల్లదని ఆయన తరుఫు న్యాయవాదులు వాదించారు. ఇదే అంశంపై సీఐడీ కూడా మరో కేసు నమోదు చేసిందని, ఒకే సంఘటనపై రెండు సార్లు కేసు పెట్టడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, పోలీసుల విచారణకు సంబంధించిన ప్రాథమిక ఆదేశాలు ఇస్తూనే కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. రానున్న రోజుల్లో ఈ కేసుపై మరిన్ని విచారణలు జరగనున్నాయి.

ANN TOP 10