అరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం సాయంత్రం వేర్వేరు జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతవగా, నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడమే ఈ దుర్ఘటనలకు ప్రధాన కారణం.
దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పసు పానీ ఆర్మీ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా వచ్చిన ఆకస్మిక వరద, 5వ గ్రెనేడియర్‌కు చెందిన రెండు షెల్టర్లను ముంచెత్తింది. ఈ వరద ఉద్ధృతిలో ఏడుగురు సైనికులు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరిని సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గల్లంతైన మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మరోవైపు, అప్పర్ సుబన్‌సిరి జిల్లాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కియోజరింగ్-బయాచింగ్ రహదారి నిర్మాణ పనుల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకోగా, నలుగురు కార్మికులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ఘటనల సమాచారం అందిన వెంటనే, సమీపంలోని పోస్టుల నుంచి సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి.









