రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బిలియనీర్ల జాబితాలో టాప్‌లో నిలిచారు. ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 200 మంది భారతీయులు ఉన్నారు. గతేడాది 169 మంది ఉండేవారు. వీరందరి సంపద 675 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ.56.30 లక్షల కోట్ల) నుంచి ఏకంగా 41 శాతం పెరిగి 954 బిలియన్ డాలర్ల(రూ. 79.60 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద రూ. 6.92 లక్షల కోట్ల నుంచి 39.8 శాతం పెరిగి రూ.9.68 లక్షల కోట్ల(116 బిలియన్ డాలర్ల)కు పెరగడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దీంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. అలాగే, ప్రపంచంలోనే తొమ్మిదవ సంపన్న వ్యక్తిగా, ఆసియా అత్యంత ధనికుడిగా కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు.









