AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సావర్కర్ వివాదంలో రాహుల్ గాంధీకి కోర్టు ఊరట..!

హిందూ సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసింది. ఈ కేసులో చట్టపరంగా అవసరమైన ముందస్తు అనుమతిని యూపీ ప్రభుత్వం నుంచి పిటిషనర్ తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల ఇది విచారణార్హం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సాగిన ‘భారత్ జోడో యాత్ర’ ర్యాలీలో సావర్కర్ ను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఆ వ్యాఖ్యలు సావర్కర్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించేలా ఉన్నాయని ఆయన ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగమేనని ఆరోపిస్తూ న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థాయనం.. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఆయన ప్రసంగం ఉందంటూ రాహుల్ కు సమన్లు జారీ చేసింది.

లక్నో కోర్టు ఇచ్చిన సమన్లను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షిల్ నాగుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. IPC సెక్షన్ 153A కింద నమోదైన ఈ కేసును విచారణకు స్వీకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. అయితే ఈ కేసులో ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తెలియజేశారు. దీంతో చట్టపరమైన అనుమతి లేని కారణంగా లక్నో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను, ఫిర్యాదును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.,

అయితే స్వాతంత్ర సమరయోధులను హేళన చేయవద్దని గతంలోనే ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ కు సుప్రీంకోర్టు చురకలు అంటించింది. అనంతరం రాహుల్‌పై సాగుతున్న క్రిమినల్ చర్యలపై అప్పట్లోనే స్టే విధించింది. అంతకుముందు రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు పూర్తి ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది.

ANN TOP 10