AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటికి వచ్చి ఉరికించి కొడతాం: బీజేపీ ఎంపీ అరవింద్‌కు కాంగ్రెస్ హెచ్చరిక..

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై అరవింద్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. తన వైఖరి మార్చుకోకపోతే ఇంటికి వచ్చి ఉరికించి కొడతామని ఘాటుగా హెచ్చరించారు. శనివారం గాంధీ భవన్‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, మెట్టు సాయికుమార్ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అరవింద్ తన నోటి దురుసును అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఎన్‌ఎస్‌యూఐ స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన బీసీ బిడ్డ మహేశ్ కుమార్ గౌడ్‌ను విమర్శించే స్థాయి అరవింద్‌కు లేదని మండిపడ్డారు. తండ్రి పేరును వాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్‌, స్వయంకృషితో ఎదిగిన నాయకులను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఎక్కడ తెచ్చారో, గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం ఏం చేశారో అరవింద్ స్పష్టం చేయాలని అనిల్ డిమాండ్ చేశారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తుంటే, అరవింద్ కేవలం విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. డీఎస్ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని నిలదీశారు.

సాయికుమార్ మాట్లాడుతూ, అరవింద్ మాటలు మద్యం దుకాణాల వద్ద తాగుబోతుల మాట్లాడే తీరులో ఉన్నాయని విమర్శించారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి కౌన్సిలర్‌గా గెలిచి చూపాలని సవాల్ విసిరారు. “ఇంకోసారి హద్దు మీరితే ఇంటికి వచ్చి మరీ గుణపాఠం చెబుతాం” అని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన పార్టీ నాయకులను అదుపులో ఉంచుకోవాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని స్పష్టం చేశారు.

ANN TOP 10