భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారని పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆవేశం, ఆందోళన లో కాంగ్రెస్ మంత్రులు తమ గతం మరిచిపోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి నల్లగొండలో పర్యటన చేయాలన్న మంత్రులు కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని ప్రారదోలి ప్రజల దాహార్తిని తీర్చినందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా ? అని రేగా మండిపడ్డారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మంత్రులందరూ నల్లగొండలోనే ఉండి ఫ్లోరైడ్ భూతాన్ని పట్టించుకోక ప్రజల జీవితాలతో ఆడుకున్నందుకు సిగ్గుపడాలిసింది పోయి కేసీఆర్ పై ఎదురు దాడి చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని రేగా అన్నారు. సాగర్ జలాలు నల్లగొండకు కూడా ఇవ్వడం చేతకాని మీకు కేసీఆర్ ను విమర్శించే అర్హత ఉందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు ఏర్పాటు చేసి, మూడు మెడికల్ కాలేజీ లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. మీ కాంగ్రెస్ హయాం లో కరెంటు లేక చీకట్లు ఉంటే, కేసీఆర్ సీఎం అయ్యాక నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నెలకొల్పారని అన్నారు. మీ మోసాలను, అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమ రేగా కాంతారావు అన్నారు.









