AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుజరాత్ ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్

అహ్మదాబాద్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్‌ ఆల్ రౌండ్ షోతో సన్‌రైజర్స్‌పై(Gujarat Titans vs Sunrisers Hyderabad) 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ సునాయసంగా చేధించింది. ఆ జట్టు బ్యాటర్లు సాయి సుదర్శన్(44), డేవిడ్ మిల్లర్(44), శుభ్‌మన్ గిల్(36) చెలరేగారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 277 పరుగుల భారీ స్కోర్ సాధించిన హైదరాబాద్ బ్యాటర్లు ఈ సారి మాత్రం తేలిపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో సన్‌రైజర్స్ 162/8 పరుగులు మాత్రమే చేసింది. సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ(3/25) హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌కు ఇది రెండో విజయం.

163 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో వృద్దిమాన్ సాహా వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన సాహా ఒక ఫోర్, 2 సిక్సులతో 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అనంతరం సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ గిల్ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. అయితే 2 ఫోర్లు, ఒక సిక్సుతో 28 బంతుల్లో 36 పరుగులు చేసిన గిల్‌ను మరో స్పిన్నర్ మయాంక్ మార్కండే 10వ ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 74 పరుగులకు గుజరాత్ 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం సాయి సుదర్శన్, మిల్లర్ కలిసి మూడో వికెట్‌కు 64 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న సాయి సుదర్శన్‌ను 17వ ఓవర్లో పాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. 36 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 4 ఫోర్లు, ఒక సిక్సుతో 45 పరుగులు చేశాడు.

దీంతో 138 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం మిల్లర్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. విజయ్ శంకర్‌తో కలిసి మిల్లర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి ఓవర్ మొదటి బంతిని సిక్సు కొట్టి మిల్లర్ జట్టును గెలిపించాడు. దీంతో సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘనవిజయం సాధించింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన మిల్లర్.. 11 బంతుల్లో 14 పరుగులు చేసిన విజయ్ శంకర్ నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు.

ANN TOP 10