(అమ్మన్యూస్, కోల్‌కతా)
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, మొదట 200 సీట్లు గెలవాలని ఆ పార్టీకి తాను సవాల్ చేస్తున్నానని అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో 200కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికిందని, అయితే కేవలం 77 సీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను బెంగాల్‌లో అమలు చేయడాన్ని తాను అనుమతించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. సీఏఏకు దరఖాస్తు చేయడం వల్ల విదేశీయులుగా మారతారని అన్నారు. అందుకే సీఏఏ కోసం దరఖాస్తు చేయవద్దని ప్రజలను ఆమె హెచ్చరించారు. ‘చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చడానికి సీఏఏ ఒక ఉచ్చు. మేం బెంగాల్‌లో సీఏఏ, ఎన్‌ఆర్సీని అనుమతించబోం’ అని అన్నారు.
మరోవైపు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సీపీఎంపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘పశ్చిమ బెంగాల్‌లో ‘భారత’ కూటమి లేదు. బెంగాల్‌లో సీసీఎం, కాంగ్రెస్ కలిసి బీజేపీ కోసం పనిచేస్తున్నాయి’ అని ఆరోపించారు.









