AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ స్వలింగ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన తొలి గే ఫిమేల్‌ పార్లమెంటేరియన్‌ అయిన పెన్నీ వాంగ్‌.. తనతో చాలాకాలంగా సహచర్యం చేస్తున్న సోఫియా అల్లౌకేను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని పెన్నీ వాంగ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

‘మా సామాజికవర్గం, స్నేహితులు అందరితో కలిసి ఈ ప్రత్యేక రోజును వేడుకగా జరుపుకోవడం సంతోషంగా ఉంది’ అని పెన్నీవాంగ్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. పెన్నీవాంగ్‌, సోఫియా అల్లౌకే వివాహ వస్త్రధారణలో పూల బొకే పట్టుకుని ఉన్న ఒక ఫొటోను వాంగ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

వాంగ్‌, అల్లౌకే గత రెండు దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇన్నాళ్ల తర్వాత శనివారం దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. పెన్నీ వాంగ్‌ దక్షిణ ఆస్ట్రేలియా నుంచి సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2002 తర్వాత అధికార లేబర్‌ పార్టీ తరఫున ఆస్ట్రేలియా క్యాబినెట్‌ పదవి దక్కించుకున్న తొలి ఆసియా జాతీయురాలుగా పెన్నీ వాంగ్‌ గుర్తింపు పొందారు‌. కాగా, ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు.

ANN TOP 10