AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల్లో పేపర్‌ వాడకాన్ని తగ్గించండి.. రాజకీయ పార్టీలకు ఈసీ సూచన..

సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. ఎన్నికల సమయంలో పేపర్‌ను తక్కువగా ఉపయోగించాలని.. అదే సమయంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను ఉపయోగించొద్దని ఈసీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సమయంలో పర్యావరణ అనుకూల వాహనాలను వినియోగించాలని, ఎక్కువ వాహనాలను ఉపయోగించకుండా కార్ పూల్‌లను ఉపయోగించేలా ప్రోత్సహించాలని ఎన్నిక సంఘం రాజకీయ పార్టీలతో పాటు అధికార యంత్రాంగానికి సూచించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నాలలో భాగంగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించొద్దు. పేపర్‌ను తక్కువ ఉపయోగించాలి. పర్యావరణ అనుకూల విధానాలను అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల యంత్రాంగం స్థానిక వ్యర్థ పదార్థాల నిర్వహణ యూనిట్ల సహాయంతో వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి ప్రయత్నించాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఓటరు జాబితాలు, ఎన్నికల సామగ్రిలో పేపర్ వాడకాన్ని తగ్గించాలని.. కాగితాలకు రెండువైపులా ముద్రించాలని.. తద్వారా పేపర్‌ సేవ్‌ అవుతుందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వాహనాల వినియోగాన్ని తగ్గించాలని.. సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరింది.
ఇదిలా ఉండగా.. 2023లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నాన్ డిగ్రేడబుల్ ఎలిమెంట్స్ వాడకాన్ని తగ్గించాలని, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్‌ను వినియోగించొద్దని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ANN TOP 10