ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత గుర్తింపు మరియు ప్రచార హక్కులకు (Personality and Publicity Rights) భంగం కలుగుతోందన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. పవన్ పేరు, చిత్రం, గొంతును ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు దశాబ్దాలుగా సినీ, రాజకీయ రంగాల్లో ఉన్న పవన్ కల్యాణ్‌కు ఉన్న బ్రాండ్ విలువను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
ముఖ్యంగా ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పవన్ కల్యాణ్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలతో కూడిన టీ-షర్టులు, కప్పులు, పోస్టర్లు అమ్మడంపై కోర్టు ఆంక్షలు విధించింది. అటువంటి ఉత్పత్తులను తక్షణమే తొలగించాలని, వాటిని అమ్ముతున్న విక్రయదారుల వివరాలను అందజేయాలని ఆదేశించింది. అలాగే ఏఐ (AI) టూల్స్ మరియు డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి పవన్ వాయిస్‌ను లేదా రూపాలను మార్చి కంటెంట్ సృష్టించడాన్ని తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించే వెబ్‌సైట్ లింకులను వారం రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది.
అయితే, సోషల్ మీడియాలోని ఫ్యాన్ పేజీలకు మాత్రం హైకోర్టు కొన్ని షరతులతో కూడిన మినహాయింపు ఇచ్చింది. అవి అధికారిక పేజీలు కావని, కేవలం ‘ఫ్యాన్ పేజీ’ మాత్రమేనని స్పష్టమైన డిస్‌క్లెయిమర్ (Disclaimer) ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొంది. ఒకవేళ పొంతన లేని సమాచారాన్ని ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటే వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చని సూచించింది. పవన్ కల్యాణ్ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.








