AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలపై భారత్ ఆగ్రహం: 2,900 పైగా హింసాత్మక ఘటనలు.. నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్!

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న నిరంతర హింసను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా హిందూ యువకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు, హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇటీవల మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, ఈ నేరానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని భారత్ డిమాండ్ చేసింది. సరిహద్దుకు అవతలి వైపు జరుగుతున్న ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.

బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనార్టీలపై దాడులు, భూకబ్జాలు మరియు హత్యలకు సంబంధించి 2,900 కంటే ఎక్కువ హింసాత్మక ఘటనలు నమోదైనట్లు స్వతంత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలను కేవలం రాజకీయ హింసగానో లేదా మీడియా అతిశయోక్తిగానో కొట్టిపారేయలేమని భారత్ తేల్చి చెప్పింది. ఇస్లామిక్ ర్యాడికల్స్ మైనార్టీలపై చూపుతున్న శత్రుత్వం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, అక్కడ శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వంపై ఉందని భారత్ గుర్తు చేసింది.

బంగ్లాదేశ్‌లో విద్యార్థి నేత హాడీ హత్య తర్వాత అల్లర్లు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఢాకా వీధుల్లో ఇస్లామిక్ ర్యాడికల్ మూకలు విధ్వంసానికి తెగబడుతూ మైనార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతవారం దీపు చంద్ర దాస్ అనే కార్మికుడిని అత్యంత క్రూరంగా కొట్టి చంపి, రోడ్డుపై చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే సామ్రాట్ అనే మరో హిందువును కూడా దుండగులు వేటాడి చంపడం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, మైనార్టీల ప్రాణ ఆస్తి రక్షణకు హామీ కోరుతోంది.

ANN TOP 10