సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సైబర్ నేరగాళ్లపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. నటి శిల్పా శెట్టి ప్రమేయం లేకుండా, ఆమె రూపాన్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ రూపొందించిన ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కంటెంట్‌కు సంబంధించిన అన్ని యూఆర్‌ఎల్స్ (URLs)ను ఇంటర్నెట్ నుండి తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది.
తన వ్యక్తిగత గోప్యత మరియు మౌలిక హక్కులకు భంగం వాటిల్లుతోందని, ఈ వీడియోలు తన గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని శిల్పా శెట్టి కోర్టును ఆశ్రయించారు. కేవలం రెండు రోజుల క్రితమే అప్‌లోడ్ అయిన కొన్ని వీడియోల వల్ల తనకు పూడ్చలేని నష్టం జరుగుతోందని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు, ఈ రకమైన కంటెంట్ ఆమోదయోగ్యం కాని స్థాయిలో ఉందని, స్త్రీలను అవమానించేలా ఉన్న ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.
మహిళల సమ్మతి లేకుండా వారి చిత్రాలను అసభ్యకరంగా ఎడిట్ చేయడం అత్యంత భయంకరమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సృష్టిస్తున్న ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోలు బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సైబర్ దాడుల నుండి పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేస్తూ, తదుపరి చర్యల కోసం నివేదిక కోరింది. ఇటీవల పవన్ కల్యాణ్, రష్మిక మందన్న వంటి తారలు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ సమస్యలను ఎదుర్కోవడం గమనార్హం.








