AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: బస్సు-కారు ఢీకొని నలుగురు హైదరాబాద్ వాసులు మృతి!

నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు గ్రామాల మధ్య ఉన్న 40వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిద్రమత్తులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు డివైడర్‌ను దాటి అవతలి వైపునకు వెళ్లి, హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు, స్థానికులు ఎంతో శ్రమించి బయటకు తీయాల్సి వచ్చింది.

ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా తెల్లవారుజామున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అలసటగా అనిపిస్తే వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ANN TOP 10