ముగిసిన రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ తరపున విజేతలకు నగదు బహుమతులు
ఆదిలాబాద్ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని పక్కనబెట్టి ప్రతిఒక్కరూ తమ క్రీడాస్ఫూర్తిని కనబర్చాలని, ఓటమిపాలైనవారు నిరాశకు లోనుకాకుండా విజయం కోసం ప్రయత్నం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు 20 రోజులుగా అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం హోప్ ఎలెవన్, ఖలీం ఎలెవెన్ జైనూర్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హోప్ ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఖలీం ఎలెవెన్ జైనూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేయగా హోప్ ఎలెవన్ జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమెకు టోర్నమెంట్ నిర్వాహకులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఓటమే విజయానికి నాంది అని, ఓటమి ఎప్పుడు పాఠం నేర్పాలని కుంగిపోవడానికి కారణం కాకూడదన్నారు. క్రీడాకారులందరూ జిల్లాస్థాయిలోనే కాదు రాష్ట్రం, జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఈ పోటీలను నిర్వహించి భారీస్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిపై ప్రశంసలు కురిపించారు.
క్రీడాకారులను ప్రోత్సహించడంపై ఆయనను అభినందించారు. అనంతరం విజేత జట్టుకు మొదటి బహుమతి కింద రెండు లక్షల 51 వేల నగదుతోపాటు ట్రోఫీని మంత్రి అందజేశారు. అలాగే రన్నరప్‌గా నిలిచిన ఖలీం ఎలెవెన్ జైనూర్ జట్టుకు ద్వితీయ బహుమతి కింద లక్షా 25 వేల నగదు, ట్రీఫీని అందజేసి క్రీడాకారులను అభినందించారు. అలాగే మూడు, నాలుగో బహుమతుల కింద రూ.11 వేల చొప్పున అందించారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు హోండా షైన్ బైక్ ప్రదానం చేశారు. క్రికెట్ పోటీల్లో అన్ని విభాగాల్లో రాణించిన ఉత్తమ క్రీడాకారులను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ అసెంబ్లీ ఇన్‌చార్జి ఆడే గజేందర్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తలమడుగు జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, జైనథ్ జెడ్పీటీసీ అరుంధతివెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, డీసీసీబీ మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్‌రెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు రషీద్ ఉల్‌హక్, జావిద్, జాంటి, ఇర్ఫాన్, షాహిద్ అలీ ఎంఏ.షకిల్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.









