AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు .. హైదరాబాద్ కు మరో గౌరవం

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical indication) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్​జనరల్​ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్​మార్క్స్​గుర్తింపును మంజూరు చేసింది.​ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు(Hyderabad Haleem) జీఐ ట్యాగ్‌ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ బేంగిల్స్‌ను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా, ఈ లక్క గాజులకు చెన్నైలోని సెంట్రల్ గవర్నమెంట్ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తిగా లక్క గాజులు చోటు దక్కించుకున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. ఇక్కడ వివిధ రకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. రెసిన్‌ పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. ఆ తర్వాత దీన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు చేతులతోనే అందంగా తీర్చిదిద్దుతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గాజుల డిజైన్లలో చాలా మార్పులొచ్చాయి. మొఘల్ వంశస్థుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతుంటారు. రాజ కుటుంబాల్లోని మహిళలు ఈ గాజులను విరివిగా ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు.

ANN TOP 10