తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని… ఆ పార్టీని ప్రజలు బొంద పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వంటి వారు కేవలం తమ మనుగడ కోసం మాత్రమే కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దీనిని బట్టే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ రోజు దేశంలో ఓడించాల్సింది ప్రధాని మోదీని అన్నారు. ఆయన దేశానికి ప్రమాదకరంగా తయారయ్యారన్నారు. కానీ బిల్లా – రంగాలు మాత్రం మోదీని ఏమీ అనడం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అన్నారు.
మోదీని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు… మోదీ ఇచ్చింది లేదని విమర్శించారు. తెలంగాణలో 17కు పదిహేడు స్థానాలు కాంగ్రెస్ గెలవాలన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఓటమితో మతి తప్పి… ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీపై మేం పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ తమను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర పునర్విభజన హామీలను ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. పునర్విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఎయిమ్స్, ఐటీఐఆర్ కారిడార్.. ఇలా ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసిందన్నారు. ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉన్న శ్రద్ద… ప్రజలపై మోదీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ 100 లక్షల కోట్ల అప్పులు తీసుకు వచ్చారన్నారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా కావాల్సిన అవసరం ఉందన్నారు.









