రాజకీయ పార్టీ అంటే డైలీ సౌండ్లు, రీ సౌండ్లతో దద్దరిల్లిపోవాలి. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ.. కండువాల హడావుడితో పార్టీ కళకళలాడిపోవాలి. నేతల డైలాగులతో మైకులు మోతెక్కిపోవాలి. అలాంటిది.. ఆ గులాబీ బ్రాంచి ఆఫీసులో అస్సలు సౌండ్ వినిపించటలేదు. మనుషులు కనిపించటలేదు. అధ్యక్షుడు అతాపతా లేకుండా పోయారు. మరో సీనియర్ నేత పక్క చూపులు చూస్తున్నారు. ఏపీలో విస్తరించిన గులాబీ కొమ్మ.. అసలు నీకేమైందమ్మా అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
BRS ఏపీ శాఖ.. ఒకప్పుడు బాగా హల్‌చల్ చేసిన పేరు. హైదరాబాద్ వచ్చి కేసీఆర్ చేత కండువాలు కప్పించుకుని గుంటూరులో బీఆర్‌ఎస్ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేశారు. తోట చంద్రశేఖర్ అధ్యక్షుడిగా ఏపీలో గులాబీ తోట గుబాళిస్తుందన్నారు. రావెల కిషోర్ బాబు లాంటి మాజీ మంత్రులు కూడా ఓహో గులాబీ బాల అంటూ రాజకీయ రాగాలు తీసి ఏపీ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఏపీలో వైసీపీ, టీడీపీలకు తామే ప్రత్యామ్నాయం అన్నారు. అయితే BRS ఏపీ శాఖ.. ఇప్పుడు ఏమైంది? ఎక్కడుంది? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అస్సలు పొలిటికల్ సౌండ్ చెయ్యకపోతే ఏమనుకోవాలి. ఏపీలో ప్రత్యామ్నాయం తామే అన్న నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కనిపించట లేదు. వినిపించట లేదు. ఇక మరో నేత, మాజీ మంత్రి రావెల రూటు ఎటు? ఆయన తాజా కామెంట్లు దేనికి సంకేతం? ఆయన పక్క చూపులు చూస్తున్నారా? BRS ఏపీ బ్రాంచ్ ఆఫీస్ ఇప్పుడు టోటల్‌గా మూగనోము పట్టడంతో రావెల లాంటి నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.









