తెలంగాణలో మత్స్యకారుల ఉపాధి, చెరువుల్లో చేపల ఉత్పత్తి పెంపే లక్ష్యంగా నిర్వహించే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం చుట్టూ అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. వర్షాలతో కొన్ని చెరువులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్న తరుణంలో మత్స్యకారులకు సకాలంలో చేప పిల్లలను అందించాల్సిన మత్స్యశాఖ నిర్లక్ష్యంలో కూరుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు టెండర్ల దాఖలుకు సోమవారం చివరి రోజైనా కాంట్రాక్టర్ల నుంచి ఎటువంటి స్పందనా వస్తుందనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. మరోవైపు బకాయిల కొండ పేరుకుపోవడంతో ఈసారి పంపిణీ అసలు సాగుతుందా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో చేప పిల్లలను సరఫరా చేసిన ప్రైవేటు కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన సరఫరాదారులు ఈసారి టెండర్లకు హాజరయ్యేందుకు వెనుకంజ వేస్తున్నారు. పాత బకాయిలన్నీ చెల్లిస్తే తప్ప కొత్త టెండర్లలో పాల్గొనేది లేదని కాంట్రాక్టర్లు తేల్చిచెబుతుండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గతేడాది కొన్ని బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు ప్రకటించినప్పటికీ అవికూడా కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమకాలేదని సమాచారం. దీంతో వారు టెండర్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది.
ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో నాణ్యమైన చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ రూ.116 కోట్లతో సన్నాహాలు పూర్తి చేసింది. లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధికి మూలస్తంభమైన ఈ బృహత్తర కార్యక్రమం కాంట్రాక్టర్లు టెండర్లలోఅసమ్మతితో పాల్గొనకపోతే కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఏర్పడింది. సీడ్ పంపిణీలో ఆలస్యమైతే చేపల ఎదుగుదల దెబ్బతిని మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారు.
రాష్ట్ర మత్స్యశాఖ పరిధిలో ప్రభుత్వ హ్యాచరీలు, సీడ్ పెంపకం కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిని ఆధునీకరించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనేది స్పష్టమవుతోంది.ప్రభుత్వ పరిధిలోని సీడ్ ఫారమ్‌లలో నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేస్తే బడ్జెట్ ఆదా అవ్వడమే కాక, సకాలంలో పంపిణీ చేసే వీలుంటుంది. అయితే, ప్రైవేటు కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడితే వచ్చే భారీ కమీషన్లకు అలవాటు పడి, శాఖ సీడ్ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేశారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలోని సీడ్ పెంపకం కేంద్రాల నిర్వహణకు కేటాయింపులు చేయకపోవడం, ఉన్నశాఖ అధికారుల పర్యవేక్షణ సైతంకొరవడి ప్రభుత్వ ఆస్తులన్నీ వృథాగా మారాయ్యయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్టర్ల పాత బకాయిలను విడుదల చేసే మార్గాన్ని అన్వేషించడంతో పాటు, టెండర్ల గడువును పొడిగించి లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ మత్స్యకారులకు సకాలంలో నాణ్యమైన చేప సీడ్ అందేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉంది. అధికారులు సైతం ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి








