ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వేడిగా ప్రారంభమయ్యాయి. సభలో ‘మెగా డీఎస్సీ-2025’పై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీ నిర్వహణలో ‘వర్టికల్, హారిజాంటల్’ రిజర్వేషన్ పద్ధతిని పక్కాగా అమలు చేశామని మంత్రి వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కొందరు కోర్టుల్లో 336 కేసులు దాఖలు చేసినప్పటికీ, న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామన్నారు. టీఈటీ పరీక్షను తప్పనిసరి చేసి, 20 శాతం వెయిటేజ్ కల్పించామని తెలిపారు. అంతేకాకుండా, క్రీడాకారులకు ప్రాధాన్యమిస్తూ గతంలో ఉన్న 29 స్పోర్ట్స్ కేటగిరీలను 65కు పెంచామని వివరించారు.
2019-2024 మధ్య కాలంలో గత వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్ రిక్రూట్‌మెంట్ కూడా చేపట్టలేదని లోకేశ్ విమర్శించారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారన్నారు. GO.117 వల్ల 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని మండిపడ్డారు. తమ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల గౌరవాన్ని పునరుద్ధరిస్తూ.. వారిని సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి విదేశాలకు అధ్యయన పర్యటనలకు పంపిస్తోందని గుర్తుచేశారు.
ఏడాది కాలం గడిచాక వైకాపా ‘టీమ్ 11’ నేతలు కావాలనే డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు డీఎస్సీ ప్రక్రియపై అవగాహన లేనివారే ‘పేపర్ లీక్’ అంటూ మాట్లాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్‌క్రిప్ట్ చేయలేని ఆన్‌లైన్ సిస్టమ్, ప్రశ్నల జంబింగ్ విధానం, పక్కాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అత్యంత పారదర్శకంగా అపాయింట్‌మెంట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. నోటిఫికేషన్ విడుదల నుండి ఫలితాల ప్రకటన వరకు ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కులం, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని, చివరికి అంబేద్కర్ రాజ్యాంగాన్నే ప్రశ్నించే స్థాయికి దిగజారారని విమర్శించారు. తనపై ఎలాంటి కేసులు లేవని, ఎక్కడికైనా వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని.. ధైర్యం ఉంటే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు.








