బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడంబరాలు, ఆర్భాటాలే తప్ప అభివృద్ధిని ఆచరణలో చూపలేదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై హనుమకొండలోని కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధిని వాగ్దానాలకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట బీరాలు పలికిన బీఆర్‌ఎస్ కనీసం ప్రధాన కాలువలను కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక దృష్టితో ఉందని, పక్కా ప్రణాళికలతో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను దొడ్డిదారిన కాజేసిన బీఆర్‌ఎస్ నేతలను వదలబోమని హెచ్చరించారు.అన్యాక్రాంతమైన భూములను జీవో 59 ద్వారా అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు. కాగా పులి వస్తోంది అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివా్‌సరెడ్డి స్పందించారు.
‘ఎన్నికల ప్రచారంలో భాగంగా పులి వంద మీటింగ్‌లు పెట్టింది.. అయినా ఏం జరిగింది.. ప్రజలు పండబెట్టార’ంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తించాలన్నారు. ఇక జనవరి నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించొద్దనే ప్రకటనలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెగ బాధపడుతున్నారని, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీని చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉందని సమాధానమిచ్చారు. ప్రజాపాలన అనే దానికి పరిపూర్ణ అర్థం కాంగ్రెస్ అని మంత్రి సురేఖ అన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న సంతోషం ప్రజల్లో కనబడుతోందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో బిల్లులు లేక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న సంగతి కేటీఆర్ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. ఆయనకు సర్పంచ్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు.









