రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నలుగురికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని నియమించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వెల్ఫేర్ కోసం ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డా. మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ &పబ్లిక్ రిలేషన్స్ ప్రభుత్వ సలహాదారుగా హెచ్. వేణుగోపాల్ రావును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా సాంసృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వేంనరేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఈయనే కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సలహాదారు పదవి దక్కిందంటున్నాయి పార్టీ వర్గాలు.
నిజామాబాద్‌కి చెందిన మైనార్టీ నేత షబ్బీర్ అలీని కూడా సలహాదారుగా నియమించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయాల్సి ఉన్నా.. రేవంత్ కోసం నిజామాబాద్ అర్బన్‌కి మారారు. ఓటమి పాలయ్యారు. ఫలితాల తర్వాత షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ కానీ మరేదైనా పదవి కానీ వస్తుందనే మాట బలంగానే వినిపించింది. ఇప్పుడు ఆయన్ను సలహాదారుగా నియమించారు.
హర్కర వేణుగోపాల్ పార్టీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. AICC సభ్యుడిగా, TPCC ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రొటోకాల్ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్న వేణుగోపాల్‌కు రాహుల్ సహా పార్టీ సీనియర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు సలహాదారుగా నియమితులయ్యారు.
ఇక మల్లు రవిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి పనిచేశారు. ఈయన కూడా రేవంత్ టీమ్‌లో కీ మెంబరే కావడం గమనార్హం..









