తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారీ ర్యాలీతో తన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ మెగా రోడ్ షో చేపట్టారు. గంటపాటు ఈ రోడ్ షో కొనసాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ. కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
మహబూబాబాద్ సభలో బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలను బీఆర్‌ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. అవినీతికి పాల్పడ్డ బీఆర్‌ఎస్ నేతలను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు ప్రధాని మోదీ. తెలంగాణకు తప్పకుండా తొలి బీసీ ముఖ్యమంత్రిని అందిస్తామన్నారు మోదీ. బీజేపీ పెరుగుతున్న శక్తి అని కేసీఆర్ చాలా కాలం క్రితమే గ్రహించారని అన్నారు. బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీ ఎప్పటికీ ఏమీ చేయదన్నారు. కేసీఆర్‌ను బీజేపీ తిరస్కరించినప్పటి నుంచి బీఆర్‌ఎస్ భయాందోళనకు గురవుతోందన్నారు.
అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరిలోకి దిగిన కరీంనగర్ నియోజకవర్గంలోనూ ప్రధాని మోదీ భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ తొలి ముఖ్యమంత్రి బీసీయే అవుతారని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణ వయస్సు పదేళ్లని.. వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని అన్నారు ప్రధాని మోదీ. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో మార్పు గాలి వీస్తోందని.. మార్పు తథ్యమని అన్నారు.









