AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్..!

మహారాష్ట్రలోని డొంబివిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలితో పాటు ఇతర వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) కార్పొరేటర్ రమేశ్ మాత్రేను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. థాణెలోని ఆయన నివాసంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

జూలై 6వ తేదీ సాయంత్రం కళ్యాణ్-డొంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) పరిధిలోని శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ శిశువుకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో బెడ్లు అందుబాటులో లేవని, మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్ రమేశ్ మాత్రే, తన అనుచరులతో కలిసి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

 

ఈ క్రమంలో రమేశ్ మాత్రే ఓ మహిళా వైద్యురాలిపై వెనుక నుంచి వచ్చి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దాడిలో మరో వైద్యుడి కూడా గాయమైంది.

 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా స్పందించడంతో, పోలీసులు మంగళవారం రాత్రి రమేశ్ మాత్రే సహా ఆరుగురిపై బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, నేరపూరిత బెదిరింపులు, అల్లర్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మాత్రేను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి నిరసనగా ఆసుపత్రి సిబ్బంది ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. అయితే, తాను వైద్యురాలిపై దాడి చేయలేదని, తమ ఫిర్యాదును పట్టించుకోకుండా ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండటంతో కేవలం ఫోన్‌ను మాత్రమే తట్టినట్లు మాత్రే సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ANN TOP 10