తెలంగాణ దంగల్ చివరి చరణంలోకి ప్రవేశించింది. మరి కొద్ది గంటల్లో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు మూగబోతాయి. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి విజన్ వారు జనంలోకి బలంగా తీసుకుపోతున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఏం చేయనుకుంటున్నారో ముందే పక్కా ఫ్లాన్‌తో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు భట్టి విక్రమార్క. కార్తీక పౌర్ణమి రోజున బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేశారు. మధిర నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన అఫిడవిట్‌పైన సంతకం చేశారు భట్టి విక్రమార్క.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని భట్టి ప్రమాణం చేశారు. నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తానన్న భట్టి, అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తానన్నారు భట్టి విక్రమార్క.









