AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ పల్లెల్లో నూతన ప్రగతి శకం..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పల్లెల ప్రగతి పథంలో పయనించడం, పాలనా సంస్కరణలే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పల్లెల ప్రగతికి పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తూ, క్షేత్రస్థాయి ప్రతినిధులు, అధికారుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 

జీపీ ఎస్‌ఏపీ (GP-SAP)పై ప్రత్యేక శిక్షణ..

గ్రామ పంచాయతీల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా సాగాలనే ఉద్దేశంతో ‘గ్రామ పంచాయతీ సుస్థిరాభివృద్ధి ప్రణాళిక’ (GP-SAP)పై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఈ సదస్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనపై వీరికి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలనే అంశంపై నిపుణులు దిశా నిర్దేశం చేయనున్నారు.

 

12 కోట్ల పని దినాలే లక్ష్యం!.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా వి.బి.జి. రామ్-జి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.6,311 కోట్ల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూలై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 కోట్ల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రతి గ్రామపంచాయతీలో నెలకు కనీసం వెయ్యి పని దినాలు సృష్టించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించే దిశగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పని దినాల కల్పనపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనివల్ల వలసలు తగ్గడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పన జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

 

కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు..

ఈ అవగాహన సదస్సులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం, కేవలం నిధులు కేటాయించడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో సక్రమంగా వినియోగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల పని సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించడంపై సర్పంచులు, కార్యదర్శుల పని సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు.

 

గైర్హాజరైతే కఠిన చర్యలు!

ఈ అవగాహన సదస్సులు, శిక్షణా తరగతులకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ సర్పంచ్ లేదా పంచాయతీ కార్యదర్శి అయినా శిక్షణకు హాజరుకాకపోతే, వారిపై తీవ్ర శాఖాపరమైన చర్యలు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ హెచ్చరించింది. పల్లెల అభివృద్ధిలో అలసత్వాన్ని అస్సలు సహించేది లేదని తేల్చి చెప్పింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సులతో పల్లెల్లో సరికొత్త ప్రగతి శకం మొదలుకాబోతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసింది.

ANN TOP 10