– డిసెంబర్ 9 నుంచి ఇందిరమ్మ రాజ్యమే..
– పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
– పటాన్‌చెరు ఇస్నాపూర్‌లో రోడ్‌షో
– భారీగా హాజరైన జనం
రాష్ట్రంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని, అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ఆదివారం రోడ్ షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు. కొడుకు, కూతురు, అల్లుడి కోసం కూడా అదే జైలులో డబుల్ బెడ్ రూం కట్టిస్తామన్నారు. రూ.లక్ష కోట్లు మింగి, పదివేల ఎకరాలను ఆక్రమించినందుకు జైలులో పెట్టిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడని.. ‘ఆ దద్దమ్మకు చెప్తున్న.. కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకకు రోడ్లు, నీటి సౌకర్యంతో పాటు నువ్వు చదువుకున్న బడిని కట్టించింది కాంగ్రెస్..‘అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశ్వనగరంగా మార్చి, ఓఆర్‌ఆర్, ఫార్మా కంపెనీలు, కృష్ణా, గోదావరి జలాలను, వ్యవసాయ శాస్త్రవేత్తలను తయారు చేసింది కాంగ్రెస్ కాదా..? ట్రిపుల్ ఐటీని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా, బిర్లామందిర్ మెట్ల మీద బిచ్చమెత్తుకుని బతికెటోళ్లు అని రేవంత్ విమర్శించారు. రబ్బర్ చెప్పుళ్లు లేనోళ్లు ఈ రోజు హెలికాప్టర్, బెంజ్ కార్లలో తిరుగుతున్నరు. బుక్కెడు బువ్వ తిని రెండు పెగ్గులు తాగెటోడు లక్షల కోట్లు సంపాదించిండు. బక్కోన్ని కొట్టడానికి కాంగ్రెస్ గుంపులుగా వస్తోందంటున్న భూబకాసురుడు, కుంభకర్ణుడు కేసీఆర్ అని రేవంత్ దుయ్యబట్టారు. డిసెంబరు 9న ఎల్బీస్టేడియంలో 9.30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు. రోడ్‌షోలో పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









