AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమత..!

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. బుధవారం కోల్‌కతాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో చోటుచేసుకున్న గందరగోళం మధ్య, సహనం కోల్పోయిన మమత ఓ కార్యకర్త చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

బారుయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ టీఎంసీ యువజన విభాగం ఈ ర్యాలీని చేపట్టింది. కోల్‌కతా హైకోర్టు అనుమతితో ప్రారంభమైన ఈ ర్యాలీని హజ్రా రోడ్డు వద్ద బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. “చోర్, చోర్” (దొంగ, దొంగ) అంటూ నినాదాలు చేస్తూ టీఎంసీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

 

ర్యాలీ ముగిసిన అనంతరం మమతా బెనర్జీ తన కాళీఘాట్ నివాసానికి చేరుకున్న సమయంలో అక్కడ భారీగా జనం గుమిగూడారు. ఆ సమయంలో తనకు దారి కల్పించేందుకు ప్రయత్నిస్తున్న ఒక కార్యకర్తపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇతరులను కూడా ఆమె పక్కకు నెట్టివేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

 

బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం

 

ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పక్కా ప్రణాళికతో తమ ర్యాలీపై దాడి చేశారని ఆరోపించారు. తమ పార్టీ మహిళా కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఆ సమయంలో పోలీసులు కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని విమర్శించారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము మమత ర్యాలీని అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10