నడుస్తున్న కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనమైన సంఘటన ఆదిభట్ల పరిధి బొంగ్లూరు ఎగ్జిట్ 12 సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 1:23 సమయంలో ఔటర్‌పై కారు మంటల్లో చిక్కుకుందని ఫోన్ వచ్చిందన్నారు. పెట్రో మొబైల్ పోలీసులు చేరుకొని ఫైర్ సిబ్బందితో మంటలార్పి కారులో కాలిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారన్నారు.
కారు నంబర్ ఆధారంగా మృతుడు సూర్యాపేట జిల్లా కోదాడ జ్యోతినగర్‌కు చెందిన బడుగుల వెంకటే్‌ష(25)గా గుర్తించామన్నారు. వెంకటేష్ శనివారం మధ్యాహ్నం ఇంటినుంచి కారులో బయల్దేరాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తల్లి అతడికి ఫోన్‌చేసింది. కన్సల్టెంట్ ఆఫీస్ పని కోసం హైదరాబాద్ వెళ్లానని, ఆదివారం వస్తానని చెప్పాడన్నారు. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం కోదాడ పోలీసులు వెంకటేష్ తండ్రి సైదులుకు ఫోన్‌చేసి చెప్పారని సీఐ తెలిపారు. సంఘటన ప్రదేశంలో కారు, మృతుడి మెడలో చైన్, చేతి బ్రాస్‌లెట్ ఆధారంగా చనిపోయింది తన కొడుకేనని సైదులు గుర్తించారన్నారు.









