AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కారు’కు భారీ కుదుపు!.. కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..

రేవంత్‌ సమక్షంలో చేరిన అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. జోగులాంబ గద్వాల్‌ జిల్లా అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే అలంపూర్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. అబ్రహం కూడా రాజీనామా చేయడంతో ఎన్నికల ముందు అలంపూర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఖానాపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ సైతం గత నెలలో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

అలంపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంకే తొలుత టికెట్‌ కేటాయించిన కేసీఆర్‌.. ఆ తర్వాత అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడిన విజయుడికి టికెట్‌ కేటాయించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనను పక్కనబెట్టి.. మరొకరికి టికెట్‌ ఇవ్వడం అబ్రహం ఆగ్రహానికి కారణమైంది. దీంతో పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు.

అలంపూర్‌లో కాంగ్రెస్‌ తరఫున సంపత్‌ కుమార్‌ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి మేరమ్మ పోటీలో ఉన్నారు. బీజేపీ తుది జాబితాలో ఆమెకు టికెట్‌ దక్కింది. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే అబ్రహం రాజీనామా చేయడంతో.. కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సీఎం సభకు సైతం అబ్రహం గైర్హాజయ్యారు. దీంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది.

ANN TOP 10