పద్మా దేవేందర్ రెడ్డి వర్సెస్ మైనంపల్లి రోహిత్ రావు..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఏ నియోజకవర్గంలో చూసినా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఇక మెతుకు సీమ మెదక్ లోను బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ల మధ్య వార్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ద్విముఖ పోరు కొనసాగుతోంది. మరి మెతుకు సీమ మెదక్ నియోజకవర్గంలోని పరిస్థితులను ప్రస్తుతం తెలుసుకుందాం. గతంలో రామాయంపేటగా వున్న ప్రాంతం, నియోజకవర్గాల పునర్విభజనలో మెదక్ స్థానంగా ఏర్పాటైంది. మెదక్, రామాయంపేట మున్సిపాల్టీలతో పాటు ఆరు మండలాలు వున్న ఈ స్థానంలో 2 లక్షల 16 వేల మంది పైగా ఓటర్లు వుండగా, గణనీయమైన సంఖ్యలో 8 వేల 500 మంది పైగా కొత్త ఓటర్లున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని గెలిపించి, లోక్ సభకు పంపిన ఘనత మెదక్ ఓటర్లది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన CSI చర్చి కూడా మెదక్ జిల్లాలోనే వుండటం విశేషం. BRS, కాంగ్రెస్, BJP, BSP తో పాటు పలు ఇతర పార్టీలు, మరో ఆరుగురు స్వతంత్రులు – మొత్తం 13 మంది అభ్యర్థులు ప్రస్తుత శాసనసభలో ఎన్నికల బరిలో వున్నారు. సిట్టింగ్ BRS అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ నుంచి వరుసగా మూడో విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని, తనకు మరో అవకాశం ఇవ్వాలని ఆమె గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BRS నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రామాయంపేట మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు తనయుడు, మైనంపల్లి రోహిత్ రావు ఇక్కడ ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. తన తండ్రి సేవలను కొనసాగిస్తానని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రోహిత్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ BJP అభ్యర్థి పి.విజయ్ కుమార్ గడప గడపకు తిరుగుతున్నారు. మహిళా ఓటర్లు అధికంగా వున్న మెదక్ నియోజకవర్గంలో విజయం ఎవరిదో నిర్ణయించడంలో వారిదే కీలక పాత్ర.









