తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. ఈ సమయంలో చేరికల విషయంలో పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా బీజేపీలోకి వెళ్లిన నేతలను తిరిగి రప్పించటంలో సక్సెస్ అవ్వటంతో..మరి కొందరు ముఖ్యులతోనూ టచ్ లో వెళ్లింది. ఇక, దివ్యవాణికి ప్రచార బాధ్యతలు అప్పగించింది.
సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన దివ్యవాణి 2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేసారు. దివ్యవాణి అప్పట్లోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కూడ ఆమె సమావేశమయ్యారు. కానీ ఆమె బీజేపీలో చేరలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంటనే పార్టీ తరపు ప్రచారం చేయాలని సూచించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని.. కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.









