కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తే, సీఎం కేసీఆర్ వాటినే పెంచి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో అంటూ విడుదల చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ సంఖ్యను పెంచి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాష్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనీ, వారంతా తమ తల్లిదండ్రులతో కలిసి 90 లక్షల మంది ఓట్లు వేస్తే కాంగ్రెస్‌పార్టీకి 90 సీట్లు వస్తాయన్నారు.
‘నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి.30 లక్షల నిరుద్యోగ యువకులారా మరో 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి’ అని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. మీ ఓటు వేసి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితే చాలన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, మీరు కదనరంగంలోకి దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్నారు.హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు జూపల్లి కృష్ణారెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్, ఫిరోజ్‌ఖాన్, అనిల్‌కుమార్ యాదవ్‌లతో కలిసి విలేకర్లతో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్నారు.









