మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్‌రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహ్మాండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశారని కొనియాడారు. హరీశ్ రావు మీద ఒక జోక్ ఉందని, హరీశ్ అటు ఇటు తిరుగుతడు.. ఎక్కడన్నా ఓ తట్టెడు పెండ కనబడితే తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకుంటడు అని చెబుతారు అని కేసీఆర్ చమత్కరించారు. ఇక్కడికి అన్ని వచ్చాయ్.. ఒక ఎయిర్ పోర్ట్ రావాల్సి ఉందన్నారు. సిద్దిపేటకు నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తల్లు దుంకుతున్నాయన్నారు. హరీశ్ స్థానంలో నేనున్నా ఇంతలా చేసేవాడిని కాదేమో… అంత అద్భుతంగా పని చేస్తున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటకు ఒక ప్రత్యేకత గౌరవం ఉంది, గత ఎన్నికల రికార్డును మీరే తిరగరాసి భారీ మెజార్టీతో హరీశ్‌ను గెలిపించాలని సీఎం కేసీఆర్ ఓటర్లను కోరారు.









