AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్

తెలంగాణలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 29న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని చెప్పారు. దీని కారణంగా తెలంగాణలో కొన్ని చోట్లు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 158.8 మిల్లీమీటర్లు కాగా, 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 4 నెలల వ్యవధిలో సాధారణం కంటే 15 శాతం అధికంగా వర్షాలు కురిశాయన్నారు.

నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మూడో వారం తర్వాత ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున.. అక్టోబర్‌లోనూ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈసారి రుతుపవనాల ప్రారంభం పది రోజులు ఆలస్యం కాగా.. ఉపసంహరణ కూడా ఆలస్యమవుతుందని ఐఎండీ తెలిపింది. గతేడాది కూడా రుతుపవనాల ఉపసంహరణ దాదాపు రెండు వారాలు ఆలస్యమైందని గుర్తు చేసింది.

ANN TOP 10