AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల రెండో రోజు అంటే మంగళవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ అనే పేరుతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అధికార విపక్ష సభ్యులు సుదీర్ఘ చర్చ నిర్వహించిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో సభలో మొత్తం 456 మంది సభ్యులు ఉన్నారు. అందులో 454 మంది ఎంపీలు.. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఓటు వేయగా.. కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. దీంతో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఆమోదానికి నోచుకుంది. బిల్లుకు అనుకూలంగా ఆ సమయానికి సభలో ఉన్న 454 మందిలు ఓటు వేయగా.. ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ.. ఆ పార్టీ మరో ఎంపీ ఇంతియాజ్ జలీల్.. మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు. మంగళవారం లోక్‌సభ ముందుకు ఈ నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లు రాగా.. బుధవారం దీనిపై చర్చ జరిగింది. దాదాపు 8 గంటల పాటు లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు.

1996 లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో మొదట ఈ బిల్లును తీసుకువచ్చారు. ఎన్నో కారణాలు, అధికార కూటమిలోని పార్టీలు మద్దతు తెలపకపోవడంతో అవి ఆమోదానికి నోచుకోలేదు. అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2010 లో రాజ్యసభలో ఆమోదం పొందినా లోక్‌సభలో వీగిపోయింది. అయితే లోక్‌సభలో మాత్రం ఇప్పుడే తొలిసారి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పడింది.

ANN TOP 10