AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన అసదుద్దీన్ ఒవైసీ.. కారణం ఇదేనట

దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమోదం కోసం ఎదురుచూస్తోన్న మహిళ రిజర్వేషన్ల బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ చివరి దశకు చేరింది. బుధవారం ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. విపక్షాలు ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతివ్వడంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చేందుకు అడుగు దూరంలో ఉంది. అయితే, ఈ బిల్లుకు కేవలం ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. వీరే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీకి చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఎంపీ ఇంతియాజ్ జలీల్‌.

ఈ కీలక బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వీరిద్దరే కావడం గమనార్హం. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు స్థానం కోసం తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశామని, ఎవరికోసమైతే బిల్లు తెస్తున్నారో వారికే బిల్లులో చోటు లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దేశ జనాభాలో సగానికి ఎక్కువ మంది ఓబీసీ జనాభా ఉంటే.. వారికి చట్టసభల్లో కేవలం 22 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు.

‘‘భారత జనాభాలో ఓబీసీలు సగానికి కంటే ఎక్కువ మంది.. కానీ పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం కేవలం 22 శాతమే.. దేశ జనాభాలో ముస్లిం మహిళల వాటా 7 శాతం.. కానీ లోక్‌సలో ముస్లిం ఎంపీలు 0.7 శాతం మందే ఉన్నారు.. మరి వారికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరు?’ అని ఆయన నిలదీశారు. ‘ఎవరికోసమైతే బిల్లు తెస్తున్నారో వారికే బిల్లులో చోటు లేకపోతే ఎలా? బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం కోసం ఇద్దరు ఎంపీలే పోరాడారని వారికి తెలియజేసేందుకే బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాం’ అని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

ANN TOP 10