AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవిశ్వాసమే మాకు అదృష్టం: లోక్‌సభలో ప్రధాని మోదీ

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈనెల 8 న అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కాగా.. చివరి రోజైన గురువారం సాయంత్రం ప్రధానమంత్రి.. ప్రతిపక్షాలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై తరచూ అవిశ్వాస తీర్మానం అస్త్రాలు ప్రయోగించి.. విపక్షాల అభాసుపాలు అవుతున్నాయని హేళన చేశారు. ప్రతిపక్షాలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలతో ప్రజల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతోందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఆ భగవంతుడే అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పి ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విపక్షాలకు ప్రజల మీద, దేశం మీద, వ్యవస్థల మీద విశ్వాసం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.‘‘ఒకసారి ప్రపంచంలో భారత ఎకానమీ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి. తొందరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుతుంది. మేం తప్పులు చేస్తున్నామంటున్నారు కదా.. ప్రతిపక్షాలుగా మీరు ఏం చేస్తున్నారు. మేము తప్పు చేస్తే.. సరైన దిశానిర్దేశం చేసే బాధ్యత విపక్షాలకు లేదా? మేం చేసే పనుల్లో తప్పులుంటే సూచనలు ఇచ్చే బాధ్యత మీకు లేదా? మేం ఏమీ చేయకుండానే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందా? కాంగ్రెస్‌కు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఆలోచన లేదు’’ అని మోదీ అన్నారు.

అవిశ్వాస తీర్మానం తమ ప్రభుత్వానికి ఎప్పటికైనా అదృష్టమైనని చెప్పారు. గతంలోనూ 2018 లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దేశ ప్రజల ముందు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాము మరింత ఎక్కువ మెజారిటీతో గెలుపొందామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా తమకు మంచి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని.. అందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా 2028 లో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉండాలని.. ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తమపై నమ్మకం ఉంచిన కోట్ల మంది భారతీయులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ANN TOP 10