సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ ఆర్జీఐఏ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలంరేపింది. మహిళను హత్యచేసి పెట్రోల్ పోసి తగులబెట్టడం కలకలంరేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి ఇక్కడ పడేసి కాల్చినట్లు అనుమానిస్తున్నారు. మహిళ ఎవరు ఎందుకు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహిళకు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని అనుమానిస్తున్నారు. మహిళను అత్యాచారం చేసి హత్యా చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మహిళ కోసం చుట్టు పక్కల పోలీస్ స్టేషన్లోని మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మహిళకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నారు. నిందితులు ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నారు. మహిళకు, హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా.. లేదంటే ఎక్కడో హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









