కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ చేపట్టిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. వీగిపోయినట్లు ప్రకటించారు. ఆగస్టు 8 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగ్గా.. చివరి రోజైన గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ప్రసంగం పూర్తయిన తర్వాత మూజువాణీ ఓటింగ్ నిర్వహించిన స్పీకర్.. అవిశ్వాసం వీగిపోయినట్లు వెల్లడించారు. మరోవైపు.. ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకుండా.. కేవలం మూజువాణీ ఓటింగ్ చేపట్టారు.
మరోవైపు.. ప్రధాని ప్రసంగం తర్వాత కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అధిర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేస్తూ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో అధిర్ రంజన్ చౌదరి పదే పదే ఆటంకాలు కలిగిస్తున్నారని.. దేశాన్ని, దేశ ప్రతిష్టను కించపరిచారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పదే పదే హెచ్చరించినప్పటికీ అధిర్ రంజన్ చౌదరీ ప్రవర్తన మార్చుకోలేదని.. తన చర్చల్లో ఎప్పుడూ నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారని ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.









