2003లో ప్రారంభమైన ట్రైన్లు
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో హైదరాబాద్ నగరంలో నడిచే ఎంఎంటీఎస్ ట్రైన్లు ఎంతటి ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు వేలాది మందిని ఈ ట్రైన్లు తమ గమ్యస్థానాలుకు చేరుస్తున్నాయి. విద్యార్థులు, చిరుద్యోగులు, కార్మికులు తమ రోజువారీ పనులకు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్లను ఆశ్రయిస్తారు. టికెట్ ధర తక్కువగా ఉండటంతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తారు. అలాంటి ఎంఎంటీఎస్ ట్రైన్లు హైదరాబాద్ నగరంలో ప్రారంభించి నేటికి సరిగ్గా 20 ఏళ్లు.
పాతబస్తీని ఐటీ కారిడార్‌తో కలుపుతూ.. 2003 ఆగస్టు 9న ఎంఎంటీఎస్ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అప్పటి ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ, ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ ట్రైన్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత 19 ఏళ్లుగా మొదటి దశలో హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్‌నుమా మార్గాల్లో ఈ ట్రైన్లు సేవలందించగా.. 20వ ఏట రెండోదశలో ఫలక్‌నుమా-ఉందానగర్, రామచంద్రాపురం- తెల్లాపూర్, సికింద్రాబాద్- మేడ్చల్, సికింద్రాబాద్- ఘట్‌కేసర్, సనత్‌నగర్- మౌలాలి, మౌలాలి-సీతాఫల్‌మండి మార్గాల్లో పరుగులు పెడుతోంది.
మినిమం టిక్కెట్ ధర రూ.2, మ్యాగ్జిమం టికెట్ ధర రూ.5తో ఎంఎంటీఎస్ ట్రైన్ల ప్రస్థానం మెుదలైంది. కరోనాకు ముందు వరకూ 121 సర్వీసులు.. 1.8 లక్షల ప్రయాణికుల వరకూ విస్తరించింది. ఎంఎంటీస్ అన్నివర్గాల ప్రయాణికులకు చేరువైందని.. రోజుకు రూ.10తో చిరుద్యోగుల్లో ప్రయాణ వెలుగులు నింపిందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయ్యే సరికి రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచుతామని ఆయన తెలిపారు.









